*నెత్తుటి తిలకం దిద్దుకున్న కొడవలి నేను

Thursday, 12 January 2012

దళిత స్త్రీని కొట్టి, బట్టలిప్పి, ఊరేగించి…..

/  

మహా రాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ సొంత గ్రామంలోనే ఒక దళిత స్త్రీని బట్టలిప్పి ఊరేగించారు. న్యాయం చెయ్యమని పోలీసు స్టేషన్ కి వెళితే ‘మీ గ్రామంలో ఇవి మామూలే కదా? కేసెందుకు?’ అని పోలీసులు తిప్పి పంపేశారు. ఈ దురన్యాయానికి కారణం మరీ ఘోరంగా ఉంది. ఆమె పాత్ర ఏ మాత్రం లేని ఓ ఘటనకి ఆమెని బాధ్యురాల్ని చేసి ఆమెను శిక్షించారు.
బాధితురాలు నలభై రెండేళ్ళ రేఖా చవాన్. ఆమె కొడుకుతో కలిసి అగ్ర కులస్ధురాలైన యువతి ఒకరు ఊరి నుండి వెళ్ళీపోవడం ఈ ఘటనకి కారణం. అగ్రకులస్ధురాలైన యువతిని ప్రేమించడం తప్పు కాదన్నది స్పష్టమే. ప్రేమించి పెళ్ళి చేసుకోవడం అసలే తప్పు కాదు. తప్పని వాదనకు భావించినా ఆ నేరానికి పాల్పడినవారిని వదిలేసి యువకుడి తల్లిని వివస్త్రని చేసి ఊరేగించడం చూస్తే అగ్రకుల పురుషాధిపత్య దురహంకారం భారత దేశంలో ఎంతగా వేళ్ళూనుకుందో మరోసారి నిరూపణ అయింది.
భారత దేశంలో ఇంకా సజీవంగా ఉన్న భూస్వామ్య ఆధిపత్య భావజాలం వల్ల దళిత కులాల ప్రజల పౌర, మానవ హక్కుల పట్ల తృణీకార భావనతో ఉండడం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అదొక సంగతి కాగా స్త్రీలపైన కూడా భూస్వామ్య వ్యవస్ధ లో ఉండే ఆధిపత్య స్వభావం కూడా అదే స్దాయిలో కొనసాగడాన్ని కూడా తాజా ఘటన రుజువు చేస్తోంది. భూస్వామ్య ఆధిపత్య వ్యవస్ధలో స్త్రీలు, దళితులు పురుషుల, అగ్ర కులస్ధుల సేవలకు వినియోగించుకునే పనిముట్లు మాత్రమే. వారు తాము మనుషులమేనని గుర్తు చేస్తే వారికి దక్కేది ఇదే.
మహా రాష్ట్ర ముఖ్యమంత్రి సొంతపట్నం కరద్ లోని ముల్‌గావ్ లో తమ కూతురు ఓ దళిత యువకుడితో ‘లేచిపోవడం’ అగ్రకుల కుటుంబానికి అవమానంగా తోచింది. అమ్మాయి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తమ కూతుర్ని ‘లేవదీసుకెళ్ళిన’ దళిత యువకుడి తల్లి ‘తమ కోపం, అవమానం’ తీర్చుకోవడానికి తేలికగా కనపడింది. సతారా జిల్లాలోని కరాద్ తాలుకా లోని గ్రామంలో ఉన్న యువకుడి ఇంటికి వెళ్ళి అతని తల్లిని ఇంటినుంది బైటికి లాగి విపరీతంగా కొట్టి, వివస్త్రను చేసి, మళ్ళీ కొడుతూ తిడుతూ గ్రామంలో ప్రదర్శించారు.
“ఆవిడ నన్ను నేలమీదికి తోసేసింది. నా చీర లాగేసారు. చెప్పులతో, కర్రలతో కొట్టడం మొదలుపెట్టారు. నా జుట్టు పట్టుకుని ఈడ్చారు. ఇలా రెండు గంటలపాటు జరిగింది” అని బాధితురాలు వెల్లడించింది. జరిగిన అవమానం నుండి ఎలాగోలా తేరుకుని పోలీసు స్టేషన్ లో రిపోర్టు ఇవ్వడానికి బాధిత స్త్రీ వెళ్ళగా అక్కడ మరో అవమానం ఎదురైంది. “మా కులం పైన అలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయనీ, కనుక ఆవిషయమై తాము చేయగలిగిందేమీ లేదనీ పోలీసులు చెప్పారు” అని బాధిత స్త్రీ టెలివిజన్ న్యూస్ ఛానెళ్ళతో చెప్పింది.
దళిత కార్యకర్తల సాయంతో మంగళవారం సాయంత్రం బాధిత స్త్రీ కరాద్ ఆసుపత్రిలో చేరింది. బుధవారం దళిత స్త్రీ పై దుర్మార్గానికి పాల్పడిన కుటుంబంలో ఐదుగురిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రేమించిన యువతి తల్లిదండ్రులు కూడ అరెస్టయినవారిలో ఉన్నారని పటాన్ డి.ఎస్.పి ఎఫ్.ఎం.నయక్వాడి చెప్పాడని ‘ది హిందూ’ తెలిపింది. ఎస్.సి, ఎస్.టి లపై అత్యాచారాల నిరోధక చట్టం క్రింద కేసులు నమోదు చేసామని పోలీసులు తెలిపారు. హోం మంత్రి ఆర్.ఆర్ పాటిల్ కఠిన దర్యాప్తు చెయ్యాలని కోరాడట.
ఇందులో మూడు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి: కుల వివక్ష రెండు: స్త్ర్రీలపై అణవివేత, మూడు: దళితులు, స్త్రీలపై అత్యాచారాలకు పొలీసుల పరోక్ష ఆమోదం. ముఖ్యమంత్రి స్వగ్రామం అయినందున పొలీసులు కూడా దళిత స్త్రీపై జరిగిన నేరాన్ని అత్యాచారంగా గుర్తించి కేసు నమోదుకు నిరాకరించడాన్ని బట్టి రాజకీయ వ్యవస్ధ కూడా భూస్వామ్య సామాజిక వ్యవస్ధకు ఎలా దన్నుగా నిలుస్తున్నదీ ఇందులో పరోక్షంగా కనిపిస్తున్న నాలుగవ అంశం.
దళితుల్లో దళితులు స్త్రీలు అని ఈ మధ్య వినిపిస్తున్న నానుడి. ఇక ‘బానిసకొక బానిసవోయ్ బానిస’ అని స్త్రీలనుద్దేశించి శ్రీ.శ్రీ గారు ఎన్నడో చేసిన వ్యాఖ్య. ఇవి రెండూ ఈ ఘటనలో ప్రత్యక్షంగా ద్యోతకం అవుతున్నాయి.

పురుషాధిక్య పోకడలకు పరాకాష్ట


Wednesday, 11 January 2012

నేడు, రేపు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు

హైదరాబాద్, జనవరి 10 : సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు బుధ, గురువారాల్లో జరగనున్నాయి. ఖమ్మంలో ఫి బ్రవరి 2, 3, 4 తేదీల్లో ఆ పార్టీ రాష్ట్ర మహాసభలు జరగనున్నందున ఈ సమావేశాలు కీలకం కానున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ కూడా వస్తున్నారు. ప్రధానంగా పార్టీ జాతీయ మహాసభలో ప్రవేశపెట్టనున్న రాజకీయ తీర్మానం ముసాయిదా ను ఈ సమావేశంలో సమర్పిస్తారు.

కాగా.. ఖమ్మంలో జరగనున్న రాష్ట్ర మహాసభల్లో కొత్త కార్యదర్శి ఎంపిక ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న రాఘవులు మూడు దఫాలు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. మూడు సార్లకు మించి కార్యదర్శిగా పనిచేయకూడదనే నిబంధన ఇంకా అమల్లోకి రానందున ఆయనకు మరో దఫా అవకాశం ఉంది. సీఐటీయూకు రాష్ట్ర అధ్యక్షునిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఉన్న ఎస్. వీరయ్యను పార్టీకి కొత్త రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేయనున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Tuesday, 10 January 2012

ఏడు తరాలు

ఏడు తరాలు

పుస్తకాలు కేవలం విజ్ఞానాన్నీ, వినోదాన్నీ పంచి ఊరుకోవు. అవి మనల్ని ప్రభావితం చేస్తాయి కూడా. అలా నన్ను ప్రభావితం చేసిన ఒకానొక పుస్తకం 'ఏడు తరాలు.' ఎలెక్స్ హెలీ ఆంగ్ల నవల 'రూట్స్' కి సహవాసి చేసిన సరళమైన తెలుగు అనువాదం. విజేతలే చరిత్రలు రాశారు, రాస్తారు. ఇది సామాన్యంగా జరిగే విషయం. ఎందుకంటే పరాజయాలు చెప్పుకోగలిగే విషయాలుగా అటు పరాజితులకీ, ఇటు సమాజానికే కూడా అనిపించవు కాబట్టి. కానీ, ఈ ఆనవాయితీని బద్దలు కొట్టిన వాడు హెలీ.

'ఏడు తరాలు' బానిసల కథ. కేవలం తమ అమాయకత్వం కారణంగా, చీకటి ఖండం ఆఫ్రికా నుంచి అమెరికాకి బానిసలుగా తీసుకురాబడ్డ దురదృష్టవంతుల కథ. పచ్చటి ఆఫ్రికా పల్లెల్లో, తమవైన సంస్కృతీ సంప్రదాయాల మధ్యన, ఆటపాటలతో జీవితం గడుపుతున్న ఆఫ్రికా వాసులని, వలవేసి పట్టుకుని, బంధించి, రోజుల తరబడి గాలైనా సోకని ఓడలలో తమ దేశానికి రవాణా చేసి, నడిబజార్లో వాళ్ళని వేలం వేసిన అమెరికన్ల కథ.

క్రీస్తుశకం 1750 లో పడమటి ఆఫ్రికా లో గాంబియా సమీపంలోని జపూరు అనే పల్లెటూళ్ళో ఉమరో-బింటా దంపతులకి నేరేడు పండులా నిగనిగలాడే 'కుంటా' అనే కొడుకు పుట్టడం కథా ప్రారంభం. ఆఫ్రికా పల్లెల సౌందర్యాన్నీ, సమస్యలనీ, ప్రకృతి వైపరీత్యాలనీ పరిచయం చేస్తూనే, అక్కడి జీవన విధానాన్నీ కళ్ళ ముందుంచుతారు రచయిత. ముఖ్యంగా పిల్లల పెంపకం, పనిపాటలతో పాటు రాయడం, చదవడం నేర్పించడం, మగ పిల్లలని ప్రత్యేకమైన 'పురుష' శిక్షణ కోసం పంపించడం ఇవన్నీ పాఠకులని ఆశ్చర్య పరుస్తాయి.

కుంటా తమ పల్లె దగ్గరలో ఉన్న అడవిలో పురుష శిక్షణ పూర్తి చేసుకుని యువకుడి గ్రామానికి తిరిగి వచ్చాక, అతనికి వేరే ఇల్లు కట్టించి అక్కడికి పంపేస్తారు తల్లిదండ్రులు. అడవుల్లో తిరిగేటప్పుడు 'తెల్లోడి' బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలో కొడుక్కి వివరంగా చెబుతాడు ఉమరో. తడిసిన కోడి మాంసం వాసన వచ్చిందంటే దగ్గరలో తెల్లోడు ఉన్నట్టేననీ, వాడి అడుగులు బరువుగా పడతాయనీ, ఆకుల్ని తుంపుతూ పోతాడనీ.. ఇలా ఎన్నో ఆనుపానులు విశదంగా చెబుతాడు.

మంచెమీద కూర్చుని రాత్రంతా పొలం కావలి కాస్తూ, యవ్వన సహజమైన కోర్కెలతో భావి సంసారజీవితాన్ని గురించి మేల్కొనే కలలు కంటూ నిద్రకు దూరమైన కుంటా, మర్నాడు ఉదయాన్నే తమ్ముడికి మృదంగం చేసి ఇవ్వడం కోసం నాణ్యమైన దుంగ కోసం అడవికి వెళ్లి ఏమరుపాటున తెల్లోడికి చిక్కుతాడు. అక్కడినుంచి అతని కష్టాలు ప్రారంభం. దెబ్బలతో స్పృహ తప్పించి తీసుకెళ్ళిన తెల్లోళ్ళు, కుంటాని ఒక ఓడలో గొలుసుతో బంధిస్తారు. ఆ ఓడ నిండా వందలాది ఆఫ్రికావాసులే.

దుర్భరమైన ప్రయాణం తర్వాత తీరం చేరుతుంది ఓడ. వేలంలో కుంటాని కొనుక్కున్న యజమాని అతనికి 'టోబీ' అని పేరు పెట్టి తనతో తీసుకెళ్ళి పోతాడు. చేతులుమారిన కుంటా వర్జీనియాలో 'నిగ్గరు' (బానిస) గా స్థిరపడతాడు. పారిపోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అవన్నీ విఫలమవుతాయి. తన ప్రయత్నానికి శిక్షగా కాలు కోల్పోతాడు. నలభయ్యేళ్ళ వయసులో తోటి నిగ్గరు బెల్ ని పెళ్లి చేసుకుని 'కిజ్జీ' కి తండ్రవుతాడు. కూతురికి జ్ఞానం రాగానే, దగ్గర కూర్చోబెట్టుకుని జపూరు గురించీ, తన బాల్యాన్ని గురించీ, తను బానిసగా వచ్చిన వైనాన్ని గురించీ వివరంగా చెప్పడంతో పాటు తన భాషనీ నేర్పుతాడు.

ఈ కథ పరంపరాగతంగా ప్రతీ తరమూ తన తర్వాతి తరానికి చెప్పడం ద్వారా, ఎనిమిదో తరం వాడైన ఎలెక్స్ హెలీకి చేరడం, అతడు చాలా పరిశోధన చేసి 688 పేజీల ఆంగ్ల నవలగా తీసుకురావడం తర్వాతి కథ. ఈ ఆంగ్ల నవల సారాన్ని క్లుప్తంగా, సరళంగా తెనిగీకరించారు 'సహవాసి' గా పేరొందిన జంపాల ఉమామహేశ్వర రావు. (నాకు కొద్దిపాటి పరిచయం ఉంది అని చెప్పుకోడానికి గర్వ పడే వ్యక్తుల్లో ఒకరీయన). తనకి మరికొంచం వివరంగా రాయాలని ఉన్నా, ప్రకాశకుల కోరిక మేరకే బాగా క్లుప్తీకరించాల్సి వచ్చిందని ఆదివారం ఆంధ్రజ్యోతి 'ఫెయిల్యూర్ స్టోరీ' కి ఇచ్చిన ఇంటర్యూ (బహుశా ఆయన చివరి ఇంటర్యూ) లో చెప్పారు.

జపూరు నాగరికత, తరాల పాటు కొనసాగిన అంచె డప్పుల వ్యవస్థ మొదలుకొని, విముక్తి కోసం కుంటా పడే తపన, తన సంస్కృతీ సంప్రదాయాలని నిలబెట్టుకోవడం కోసం పడే తాపత్రయం వెంటాడతాయి. అంతేనా? నిగ్గర్ల కష్టాలు, యజమానుల కారణంగా వాళ్ళు పడే హింస, ఒకరితో ఒకరు కనీసం మాట్లాడుకోలేని అసహాయత, యజమానుల మెప్పు కోసం చేసే వృధా ప్రయత్నాలు ఇవన్నీ కలుక్కుమనిపిస్తాయి. ఒక్క క్షణం ఏమరుపాటు కారణంగా తమ జీవితాలనే మూల్యంగా చెల్లించిన వాళ్ళు వాళ్ళంతా. అంతే కాదు, ప్రపంచానికి నాగరికత నేర్పానని నిస్సిగ్గుగా చెప్పుకునే దేశం చేసిన అనాగరిక పనికి ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా.

తరచి చదవగలిగితే ఎన్నో జీవిత సత్యాలని విప్పి చెబుతుందీ నవల. ఒక్కో పాత్రనుంచీ నేర్చుకోగలిగింది ఎంతైనా ఉంది. సహవాసి రాసిన ఎన్నో చిన్న వాక్యాలు పదే పదే వెంటాడతాయి. ఆలోచనల్లో పడేస్తాయి. ప్రతి ఒక్కరూ చదవాల్సిన, చదివించాల్సిన ఈ నవలని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది.

సిపిఎం నగర కార్యదర్శి గా 7వ సారి ఆంద్రోడు

తెలంగాణ ఉద్యమం పెద్ద ఏత్తున జరుగున్నా కమ్మోల్ల పార్టీ సిపిఎంలో మాత్రం మార్పు రావడం లేదు. తెలంగాణ జిల్లాలైన నలగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్ మొదలైన జిల్లాలనుంచి వచ్చిన ఎంతో మంది కార్యకర్తలు చాలా కాలం నుంచి పార్టీలో పనిచేస్తున్న వారిని కాదని మల్లి ఆంద్రోన్నే జిల్లా కార్యదర్శిగా చేయడం జరిగింది...ఒక వైపు కేంద్ర కమిటి నుంచి కింది స్థాయి వరకు ఉన్న కమిటిలో ఒక వ్యక్తి మూడు సార్ల కంటే ఎక్కువ న్యాయకత్వ స్థాయిలో ఉండకుండా ఉండేందుకు పార్టీ నియామావళిలో మార్పు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటే దానిని ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళి తిరిగి ఆంద్రోన్నే జిల్లా కార్యదర్శిగా చేయడం చూస్తుంటే ఆంద్రొడు పదవిని వదలి ఉండలెడని అర్థం అవుతుంది...ప్రభుత్వ ఉద్యోగం వెలగబెట్టి రీటైర్ అయిన ఒక ఆంద్రోడు ఇన్ని సార్లు వరుసగా పదవిని పాతుకొని ఉంటే తెలంగాణ జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలు ఎప్పుడు పార్టీ కార్యదర్శి పదవి వరిస్తదో ఆలోచించాలి....పార్టీలో తెలంగాణకు చెందిన ఎంతోమంది కార్యకర్తలు ఉన్నా వారిని కాదని తిరిగి ఆంద్రోన్నే కార్యదర్శినిగా చేయడం అంటే తెలంగాన పట్ల ఎంత చిన్నచూపు ఉందో అర్థం చేసుకొవచ్చు...తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎం.శ్రినివాస్ రెడ్డి, గెల్వయ్య, చంద్రశేఖర్, నరసిం హ రెడ్డి , రవి, శోమయ్య, వంటి వాల్లు ఉన్నా వాల్లను కాదని మల్లి ఆంద్రోన్నే చేయడం ధురదృష్టకరం..